KOODALI

Monday, March 12, 2012

సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది. అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.
ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు. ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ఆ గుడిసె లో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.
ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు. తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి. తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.  తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.
తెల్లవారి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది. అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసిన అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.
“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా. దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.
ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఒక్కసారి తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతం కావచ్చు.

No comments: